ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఇది లవ్ జిహాదే: సాఫ్ట్‌వేర్ యువతి ఆవేదన

  • ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని యువతి ఆరోపణ
  • సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి చేశారని ఫిర్యాదు
  • వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధింపులకు గురిచేశాడని ఆవేదన
ప్రేమ పేరుతో వల వేసి, పెళ్లి చేసుకుని ఓ వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేశాడని, ఇది కచ్చితంగా 'లవ్ జిహాదే'నని హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ యువతి ఆరోపించింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా, బలవంతంగా మతం మార్పించాడని ఆవేదన వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తల్లితో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆమె, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.

కూకట్‌పల్లిలో నివాసముంటున్న తాను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నానని బాధితురాలు తెలిపింది. తమ ఇంటి కింద షాపును అద్దెకు తీసుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడని చెప్పింది. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకునేందుకు మతం కూడా మారుతానని నమ్మించాడని పేర్కొంది. తన పేరును నవాజ్ నుంచి నవదుర్గగా మార్చుకున్నట్లు ఓ ధ్రువపత్రం కూడా చూపించడంతో, అతడిని నమ్మి గత ఏడాది జులైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు వివరించింది.

అయితే, పెళ్లి తర్వాత అతడి అసలు స్వరూపం తెలిసిందని, అప్పటికే అతడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయని, పిల్లలు ఉన్నారని తెలిసి షాక్ అయినట్లు చెప్పింది. పెళ్లికి ముందు, ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి నవాజ్‌, అతడి సోదరులు, స్నేహితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేసింది. కర్ణాటకలోని గుల్బర్గా దర్గాకు తీసుకెళ్లి, బలవంతంగా తన పేరును నజీరాగా మార్చి మత మార్పిడి చేయించాడని కన్నీళ్లు పెట్టుకుంది.

తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలతో నవాజ్ తనను బ్లాక్‌మెయిల్ చేసేవాడని, తన తల్లిని, సోదరిని చంపేస్తానని బెదిరించేవాడని వాపోయింది. అతని వేధింపుల వల్లే ఉద్యోగం కూడా కోల్పోయానని చెప్పింది. ఈ ఏడాది జనవరిలోనే కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా, అభ్యంతరకర వీడియోలు ఉండటంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని తెలిపింది. తనలా మరో యువతి మోసపోకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ధైర్యం చేసి బయటకు వచ్చానని, నిందితుడిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది.

Software Engineer
Love Jihad
Hyderabad
Nawaz
Religious Conversion
Harassment
Kukatpally Police
Cyber Crime

More Telugu News